హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తు కోసం ప్రయత్నించి, చివరి నిమిషంలో కాంగ్రెసు తప్పుకోవడంతో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కంగు తిన్నారు. ప్రజారాజ్యం పార్టీతో ప్రస్తుతానికి పొత్తు లేదని ఢిల్లీలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పడంతో చిరంజీవి శిబిరంలో ఒక్కసారి నిస్తేజం అలుముకుంది. ప్రజారాజ్యం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యతో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి భేటీ రద్దయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒంటరిగానే పోతామని సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ప్రజారాజ్యం ప్రకటించింది.
ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదనపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అవసరమైతే పొత్తు అవసరం లేదని చెప్పడానికి ఢిల్లీ వెళ్లడానికి కూడా జగన్ వర్గం సిద్ధమైంది. జగన్ ను దెబ్బ తీయడానికే చిరంజీవితో పొత్తుకు కుట్ర చేస్తున్నారనే వ్యాఖ్యలు బహిరంగంగానే వ్యక్తమయ్యాయి. కాంగ్రెసు పార్టీలో తీవ్ర కలకలం మొదలైంది. రఘువీరా రెడ్డి వంటి మంత్రులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.
తాను అధిష్టానం అనుమతితోనే ప్రజారాజ్యం పార్టీ నాయకులతో చర్చించినట్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు సమక్షంలోనే చర్చలు జరిగాయని ఆయన నచ్చజెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ప్రజారాజ్యం పార్టీతో పొత్తు ఉండదని వీరప్ప మొయిలీ ప్రకటించడంతో ప్రజారాజ్యం, కాంగ్రెసు పార్టీల మధ్య చర్చలు ఆగిపోయాయి.
మరిన్ని వివరములు:
కాంగ్రెసు
ప్రజారాజ్యం
చిరంజీవి
సంబంధిత వార్తలు